తూర్పుగోదావరి, తుని రూరల్: అప్పు చేసి కష్టించి పండించిన చెరకు పంట పేమెంట్లు అందక, చేసిన అప్పులకు వడ్డీలు, పనులు చేసిన కూలీలకు కూలి డబ్బులు చెల్లించలేక ఓ రైతు తన పంట పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుని మండలం ఎన్.సూరవరం గ్రామంలో బుధవారం జరిగింది. నాలుగేళ్లలో పాలకుల విధానాలతో అప్పులపాలైన జీలకర్ర శివాజీ(48) తన పంట పొలంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత టీడీపీ ప్రభుత్వంలో అనుసరించిన వ్యతిరేక విధానాలు సాగుదారులను నేటికీ వెంటాడుతున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు జీలకర్ర శివాజీకి రూ.ఐదు లక్షలకుపైబడి అప్పులు ఉన్నట్టు బంధువులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు జీలకర్ర శివాజీకి సొంత భూమి అరెకరంతోపాటు మూడెకరాలను కౌలుకు తీసుకుని చెరకు, పత్తి, వరి పంటలు సాగు చేస్తున్నాడు. గిట్టుబాటు ధర లేక నాలుగైదేళ్లుగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఏటా అప్పులు పేరుకుపోయాయి. ఈ దశలో 2018–19 సీజన్‌లో తాండవ చక్కెర కర్మాగారానికి రైతు జీలకర్ర శివాజీ చెరకు సరఫరా చేశాడు. 15 రోజుల్లో చెల్లించాల్సిన చెరకు పేమెంట్లు తాండవ షుగర్స్ యాజమాన్యం చెల్లించలేదు. అయినా ఈ ఏడాది కూడా అప్పులు చేసి పండించిన చెరకు పంటను ఇటీవల తాండవ షుగర్స్‌కు సరఫరా చేశాడు. అప్పుదారులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే ఫ్యాక్టరీ నుంచి బకాయిలు విడుదలైన వెంటనే చెల్లిస్తానంటూ కాలాన్ని నెట్టుకువచ్చాడు.